AP | పెన్షన్ డ‌బ్బుతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్..

(కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ‌) : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఒక వెల్ఫేర్ అసిస్టెంట్.. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రూ.7.50 లక్షల పెన్షన్ డబ్బును తీసుకుని పరార‌య్యాడు.

కంచికచర్ల సచివాలయం 3 ప్రాంతంలో ఈ ఉదయం (మంగళవారం) వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, ఉదయం 8 గంటలైనా పింఛన్ల పంపిణీ ప్రారంభం కాలేదు. వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ విధులకు హాజరుకాక‌పోవ‌డంతో.. లబ్ధిదారులను ఆందోళనకు గుర‌య్యారు.

తరుణ్ కుమార్ పరారీలో ఉన్నాడని భావించిన అధికారులు అతని కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. గత జూలైలో సంక్షేమ సహాయకుడిగా బదిలీ తరుణ్ కుమార్ కు, అతిని కుటుంబ సభ్యులను ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో పింఛన్ దారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మరో విధంగా డబ్బులు సేకరించి కంచికచర్ల ఎంపీడీఓ లక్ష్మీకుమారి పింఛన్ల పంపిణీని ప్రారంభించారు.

తరుణ్‌ కుమార్‌పై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని ఎంపీడీవో వెల్లడించారు. ఈ విషయంలో కంచికచెర్ల పోలీస్ స్టేషన్‌లో తరుణ్ కుమార్‌పై ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తరుణ్ కుమార్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంచికచెర్ల ఎస్ఐ బోనగిరి రాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *