బాల్యాన్ని బందీ చేస్తున్న బడులు
బాల్యాన్ని బందీ చేస్తున్న బడులు
విద్యా మాఫియా ఇష్టారాజ్యం..
ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విమర్శలు
మామూళ్ల మత్తులో విద్యాశాఖ..?
నిబంధనలు ఉల్లంఘిస్తున్నా చర్యలు కరవు
అచ్చంపేట, జూన్ 7 (ఆంధ్రప్రభ): విద్య సేవగా ఉండాల్సిన రోజులు పోయి వ్యాపారంగా మారిపోయిన పరిస్థితులు అచ్చంపేట పట్టణంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్య పేరుతో తల్లిదండ్రుల జేబులు ఖాళీ చేస్తుంటే, విద్యార్థుల బాల్యాన్ని మాత్రం నాలుగు గోడల మధ్య బంధిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆకర్షణీయమైన ప్రకటనలు, 100 శాతం ఫలితాలు, ఐఐటీ-నీట్ కోచింగ్ పేర్లతో మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా, ఖర్చు తగ్గించుకునేందుకు అరకొర సిబ్బందితోనే తరగతులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలా.. లేక వ్యాపార సముదాయమా?

విద్యను బోధించాల్సిన పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయనే విమర్శలు ఉన్నాయి. పుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫారాలు, బెల్టులు, టైలు, షూలు అన్నీ పాఠశాలల నుంచే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో తక్కువ ధరకు లభించే వస్తువులను మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ధరలకు విక్రయిస్తూ విద్య పేరుతో దోపిడీ చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
ఆటస్థలం లేదు.. ఆడుకునే అవకాశం లేదు!
పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఆటలు ఎంతో అవసరం. అయితే జిల్లాలోని అనేక ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం ఆటస్థలం కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇరుకు గదుల్లో రోజంతా కూర్చోబెట్టి పుస్తకాల భారంతో విద్యార్థుల బాల్యాన్ని హరిస్తున్నారని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఒకవైపు ప్రభుత్వాలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంటే, మరోవైపు ప్లేగ్రౌండ్ లేకుండానే ప్రైవేట్ పాఠశాలలు కొనసాగడం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్నా రెన్యువల్స్ ఎలా?
కనీస మౌలిక వసతులు లేని పాఠశాలలకు గుర్తింపులు, రెన్యువల్స్ ఎలా లభిస్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. తరగతి గదులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఆటస్థలం, భద్రతా ప్రమాణాలు వంటి అంశాల్లో నిబంధనలు పాటించని పాఠశాలలకు అనుమతులు ఎలా మంజూరవుతున్నాయో ప్రజలకు అర్థం కావడం లేదని పేర్కొంటున్నారు.
ప్రతి సంవత్సరం తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
విద్యాశాఖపై ఆరోపణలు
మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కొందరు అధికారులు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘనలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నా, తల్లిదండ్రులు ఆర్థికంగా నలిగిపోతున్నా సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
విద్యా వ్యవస్థను కాపాడేది ఎవరు?
విద్యను వ్యాపారంగా మార్చి కోట్ల రూపాయలు దండుకుంటున్న సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలల గుర్తింపులను రద్దు చేసి, అక్రమ ఫీజులు, బలవంతపు విక్రయాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు.
బాల్యం బందీ అవుతుంటే, విద్య వ్యాపారమవుతుంటే, అధికారులు మౌనంగా ఉంటే రేపటి తరాల భవిష్యత్తుకు బాధ్యత ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు సమాజం ముందుంది.
