రెవెన్యూ భవన్‌లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ వెల్లడి

శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్ (ఎస్.ఆర్. శంకరన్ హాల్)లో సోమవారం (జూన్ 29) జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్–PGRS) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుల పరిష్కార స్థితిని అదే వెబ్‌సైట్‌లో లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు ముందుగా సంబంధిత మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లోనే తమ వినతులు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలతో ఉన్నవారే జిల్లా కేంద్రంలో జరిగే వేదికకు హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ భవన్‌లో నిర్వహించే జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.