అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరును ఆధునికీకరించే దిశగా ముఖ్యమైన అడుగు పడింది. మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. బేగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్వాడీ సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు డిజిటలైజేషన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా పిల్లల హాజరు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య వివరాలు వంటి అంశాలను సులభంగా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని, అంగన్వాడీ కేంద్రాలు ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. సీడీపీఓ తేజస్విని మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించి అందుబాటులో ఉన్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్మార్ట్‌ఫోన్ల పంపిణీతో అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ తేజస్విని, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, పాల్గొన్నారు.

Leave a Reply