ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎండి సయ్యద్ శనివారం డిమాండ్ చేశారు.

పీఆర్‌సీని వెంటనే అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ ప్రధాన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను మభ్యపెడుతూ అవసరం లేని ప్రకటనలు చేస్తోందని విమర్శించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాల నుంచి 1.5 శాతం కోత విధించినప్పటికీ ఇప్పటివరకు ఆరోగ్య కార్డులు అందించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణకు దోహదపడే విధంగా అవసరం లేని హామీలు, నిర్ణయాలు తీసుకోవడం ఆందోళనకరమని సయ్యద్ అభిప్రాయపడ్డారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాన డిమాండ్ల సాధన కోసం అవసరమైతే సమ్మెతో పాటు ఇతర ఉద్యమ కార్యక్రమాలకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు.