పేదరికాన్ని జయించి బీఎస్ఎఫ్ ఉద్యోగం..

పేదరికాన్ని జయించి బీఎస్ఎఫ్ ఉద్యోగం..

కేసముద్రం యువకుడి విజయగాథ

కేసముద్రం, ఆంధ్రప్రభ:
పేదరికం చదువుకు అడ్డంకి కాదని, పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాన్నైనా అధిరోహించవచ్చని నిరూపించాడు ఆ యువకుడు. కేసముద్రం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన చింతకుంట్ల చరణ్ కుమార్ అతి చిన్న వయసులోనే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఉద్యోగం సాధించి, తన కుటుంబానికి, గ్రామానికి తీరని కీర్తిని తీసుకువచ్చాడు. ఈనేపధ్యంలో చరణ్ కుమార్ ఉద్యోగం సాధించిన అనంతరం, ప్రముఖ సామాజిక నాయకులు సమ్మిగౌడ్ చిలువేరును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

స్వయంకృషితో సాధించిన విజయం.. యువతకు ఆదర్శం
చరణ్ కుమార్ తండ్రి చింతకుంట్ల ముత్తయ్య తాపీ మేస్త్రిగా తల్లి పుష్పలత ఆశా వర్కర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎంతో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చరణ్ కుమార్, నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించి స్వయంకృషితో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. ఈ సందర్భంగా సమ్మిగౌడ్ మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి, ఎన్నో కష్టాలను ఓర్చి దేశ సేవ చేసే స్థాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయం. చరణ్ కుమార్ సాధించిన ఈ విజయం గ్రామంలోని ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుంది అని కొనియాడారు.

బీఎస్ఎఫ్ తో ఆగకుండా భారతీయ పోలీస్ సర్వీస్ ఉద్యోగం సాధించాలనీ చరణ్ కుమార్ ఇక్కడితోనే ఆగిపోకుండా, భవిష్యత్తులో ఉన్నతమైన భారతీయ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిగా ఎదగాలనే లక్ష్యంతో మరింత కష్టపడాలని సమ్మిగౌడ్ ఆకాంక్షించారు. ఆ లక్ష్య సాధనలో విద్యాపరంగా, మార్గదర్శకత్వం పరంగా ఎలాంటి సహాయం అవసరమైనా తానే పెద్దన్నగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

పెద్ద దిక్కుగా నిలిచిన సమ్మిగౌడ్

గత ఎన్నో సంవత్సరాలుగా ఆశా వర్కర్ల సమస్యలపై నిరంతరం పోరాడుతూ.. వారికి అండగా నిలుస్తున్న సమ్మిగౌడ్ పట్ల చరణ్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి కూడా పెద్ద దిక్కుగా ఉంటూ, అనేక సందర్భాల్లో చరణ్ విద్యాభ్యాసంపై, భవిష్యత్తుపై ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందించారని వారు భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.అనంతరం సమ్మిగౌడ్ చరణ్ కుమార్‌ను ఘనంగా శాలువాతో సత్కరించి, దేశ సేవలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని దీవించారు.

Leave a Reply