Social Media | యువతి దుర్మరణం

Social Media | యువతి దుర్మరణం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరిక ఒక యువతి ప్రాణాలను బలి తీసుకుంది. ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ బైక్ ప్రమాదంలో యువతి మృతి చెందిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో రీల్స్ మోజు యువతను ప్రమాదాల బారిన పడేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన ఇక్రా (19) అనే యువతి ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.

ఆదివారం తెల్లవారుజామున ఆమె తన స్నేహితుడు హసీంతో కలిసి రీల్స్ చిత్రీకరణ కోసం జాతీయ రహదారిపైకి వెళ్లింది. ఇక్రా స్పోర్ట్స్ బైక్‌ను వేగంగా నడిపిస్తుండగా, వెనుక కూర్చున్న హసీం వీడియో చిత్రీకరిస్తున్నాడు.

ఈ సమయంలో వీడియో కోసం వెనక్కి తిరిగిన ఇక్రా నియంత్రణ కోల్పోయి బైక్‌ను రహదారిపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇక్రా మృతి చెందింది. హసీం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదానికి ముందు వారు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇద్దరూ హెల్మెట్‌లు ధరించలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply