షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం.. పూరిల్లు దగ్ధం
కూడబెట్టుకున్న నగదు సైతం అగ్నికి ఆహుతి
గుడివాడ, ఆంధ్రప్రభ: గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడులో సోమవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధురాలు సాలి నాంచారమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న గ్యాస్ బండకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు భారీగా వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లోని సామగ్రి సైతం కాలిపోయింది. ఇల్లు నిర్మించుకునేందుకు రూపాయి రూపాయి కూడబెట్టుకున్న కొంత నగదు ఇంట్లో ఉందని, ఆ నగదు కూడా అగ్నికి ఆహుతైందని వృద్ధురాలు నాంచారమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
