విద్యార్థుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలి
క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలి: విక్కుర్తి
అవనిగడ్డ, ఆంధ్రప్రభ: విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అవనిగడ్డ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు భోజన ప్లేట్లను పంపిణీ చేశారు. దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు దాతగా ముందుకు వచ్చి ప్లేట్లను అందించగా, ముఖ్య అతిథిగా హాజరైన అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి విక్కుర్తి మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యాభివృద్ధితోపాటు వారి ఆరోగ్యం, సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని విక్కుర్తి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విద్యార్థులకు అవసరమైన భోజన ప్లేట్లను అందించిన దాత కొల్లూరి వెంకటేశ్వరరావును ఆయన అభినందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు విక్కుర్తి రాంబాబు, అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, క్లస్టర్ ఇన్‌చార్జి బండే రాఘవ, పార్టీ నాయకులు బచ్చు రఘునాథ ప్రసాద్, దాసినేని శ్రీనివాసరావు, బర్మా శ్రీనివాసరావు, కమ్మిలి సుబ్రహ్మణ్యం, మొఘల్ మురాద్, లుక్కా శ్రీను, అడపా వెంకటేశ్వరరావుతోపాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
