రామాలయంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు
వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి క్షీరాభిషేకం.. ఉదయం నుంచే భక్తుల సందడి
కరీమాబాద్, ఆంధ్రప్రభ: నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు నాగేంద్ర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం 34వ డివిజన్ శివనగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కొలువుదీరిన వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామికి భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతోపాటు పాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు చంద్రప్రసాద్ శర్మ, ఈశ్వరచంద్ర ప్రసాద్ శర్మ, బండారు జయశంకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీ సీతారామచంద్రస్వామి ట్రస్టు కార్యవర్గం, పద్మాలయ పరపతి సంఘం కార్యవర్గం, ఏకవీర పరపతి సంఘం కార్యవర్గం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నాగుల పంచమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
