ఫోక్ క్వీన్‌కు వెండితెర పిలుపు…
- ప్రియదర్శి సరసన నాగదుర్గ..
- సుకుమార్ క్యాంప్‌లో బంపర్ ఆఫర్
- హీరోయిన్ గావరుస అవకాశాలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: యూట్యూబ్ వేదికగా తెలంగాణ ఫోక్ డ్యాన్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ యువ భామ ఇప్పుడు వరుసగా సినీ అవకాశాలతో బిజీబిజీ అయ్యింది.
ఇప్పటికే తమిళంలో తెరకెక్కుతున్న ‘లవ్ ఓ లవ్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నాగదుర్గ, వెండితెరపై తన తొలి అడుగు వేసింది. దర్శకుడు మగేష్ రాజేంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటుడు పవిష్ నారాయణ్ సరసన ఆమె ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన నాగదుర్గకు ఇది తమిళ చిత్రసీమలో తొలి అవకాశం కావడం విశేషం.
ఇక తాజాగా టాలీవుడ్‌లోనూ ఆమెకు బంపర్ ఆఫర్ దక్కించుకుంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో నిర్మిస్తున్న ఓ ఫ్యామిలీ డ్రామాలో నాగదుర్గ హీరోయిన్ గా ఛాన్స్ కోట్టేసింది. ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించనున్నాడు.
ఒకప్పుడు యూట్యూబ్‌లో ఫోక్ వీడియోలతో ప్రేక్షకులను అలరించిన నాగదుర్గ.. ఇప్పుడు వరుస అవకాశాలతో వెండితెర వైపు పరుగులుతీస్తుంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే పాత్రల్లో ఆమె సహజ నటన ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరోవైపు 2017లో సుకుమార్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన ప్రియదర్శి.. ఇప్పుడు అదే బ్యానర్లో ప్రధాన కథానాయకుడిగా నటిస్తుండటం కూడా ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.









