అమరావతి : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆశించిన ఉపశమనం లభించలేదు. ఆయన దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై వచ్చే గురువారం విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసి, వైద్య చికిత్స పొందేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇదే వైఖరిని అవలంబించింది. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కూడా గురువారమే విచారిస్తామని పేర్కొంది. మరోవైపు, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో వల్లభనేని వంశీని రెండోసారి తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు నూజివీడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కస్టడీ పిటిషన్‌పై విచారణను నూజివీడు కోర్టు రేపటికి వాయిదా వేసింది.