చర్చనీయాంశమైన ఇద్దరు ఉద్యోగుల వ్యవహారం..
మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ఆ ఇద్దరిపై ఈ ఇద్దరు ఉన్నతాధికారులకు అంతటి అభిమానం ఎందుకు కలిగింది..? సంస్థాగతంగా చేపట్టిన బదిలీల విషయంలో వీరు మరెందుకు తలదూరుస్తున్నారు..? మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ‘లాంగ్ స్టాండింగ్’ పేరుతో సింగరేణిలో ఒకే చోట చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై సంస్థ ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. కోల్‌బెల్ట్ వ్యాప్తంగా మొత్తం 223 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి స్పందించిన కార్పొరేట్ స్థాయి అధికారులు బదిలీల ప్రక్రియను చేపట్టారు.

ఈ క్రమంలో శ్రీరాంపూర్ ఏరియాలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కొందరికి కూడా ఇతర ప్రాంతాలకు బదిలీలు జరిగాయి. అయితే వారిలో ఇద్దరి బదిలీలను నిలిపివేయడానికి ఏరియా స్థాయి ఉన్నతాధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇద్దరిని బదిలీ చేయకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగించేలా నోట్ ఫైల్ పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది.
దీంతో, ఆ ఇద్దరు ఉద్యోగుల బదిలీల రద్దు కోసం ఉన్నతాధికారులు ఎందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. సంస్థ నిబంధనల ప్రకారం చేపట్టిన బదిలీల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమిటన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో సాగుతోంది.
