జన్నారం, మార్చి 11 (ఆంధ్రప్రభ): అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో 97మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ఆర్థికంగా ఎంతో మేలును చేకూర్చుతుందన్నారు. పెండ్లి చేసుకున్న అర్హులైన ప్రతి ఆడపడుచుకు రూ.1,00,016.00 చెక్కులను ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి పేదవారి శ్రేయస్సును కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుందని ఆయన చెప్పారు. పల్లెల్లోని పేదలు బాగున్నప్పుడే ప్రభుత్వం బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇచ్చిన చెక్కులను సకాలంలో లబ్ధిదారులు బ్యాంకులో జమ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సి.రాజ మనోహర్ రెడ్డి, స్థానిక ఇన్చార్జి ఎంపీడీవో ఎం.డి హుమర్ షరీఫ్, జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు దుర్గం లక్ష్మీనారాయణ, సయ్యద్ ఫసిహుల్ల, తదితరులు పాల్గొన్నారు.