TG | పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం..
TG | పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం..
- ఎదురెదురుగా ఢీకొన్న కారు-బొలెరో.
- స్కోడా కారు బోల్తా, ఒకరు మృతి
చిట్యాల, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిట్యాల గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలానికి చెందిన గౌస్మియా కుమారుడు బాసిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి రామన్నపేటలోని జేపీ గార్డెన్స్‌లో జరిగే బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు స్కోడా కారు (TS 08 HD 3607)లో బయలుదేరాడు. చిట్యాల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ముందుగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఎదురుగా భువనగిరి వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం కారును బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం తీవ్రతకు స్కోడా కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బాసిత్ బావ షేక్ జావేద్ భాషా తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
అదే కారులో ఉన్న షేక్ రియాజ్, షేక్ షాకీర్లకు తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య షేక్ నభిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల ఇన్‌స్పెక్టర్ మామిడి రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

