బస్వాపూర్‌లో ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరా

బస్వాపూర్‌లో ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరా
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ:
వేసవికాలం దృష్ట్యా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగటంతో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. దీనివల్ల గ్రామాల్లోని బోరుబావుల్లో సైతం నామమాత్రంగానే నీరు వస్తోంది. దీనికి తోడు మిషన్ భగీరథ నీరు కూడా అరకొరగానే సరఫరా అవుతుండటంతో కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది.
ఈ పరిస్థితిని గమనించిన బస్వాపూర్ గ్రామ సర్పంచ్ వెంకటరమణ సురేష్ గొండ, గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి గురువారం నుంచి గ్రామంలో ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వేసవి ముగిసే వరకు గ్రామంలో నీటి కొరత లేకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందే వరకు తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా ప్రతి గల్లీకి మంచినీటిని సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఎండల తీవ్రతతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడంపై బస్వాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బస్వాపూర్‌లో ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరా
