పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీలో కడియం కావ్య

పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీలో కడియం కావ్య

చిలుపూర్, ఆంధ్రప్రభ:
దేశవ్యాప్తంగా మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారతకు సంబంధించిన అంశాలపై కీలక సూచనలు చేసే ప్రతిష్ఠాత్మక ‘పార్లమెంటరీ మహిళా సాధికారత స్థాయి కమిటీ’లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యకు సభ్యురాలిగా చోటు దక్కింది. లోక్‌సభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి సీనియర్ పార్లమెంటేరియన్ డి.పురందేశ్వరి అధ్యక్షత వహించనున్నారు. లోక్‌సభ , రాజ్యసభలకు చెందిన మహిళా ఎంపీలు ఈ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు.

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యకు ఈ కీలక జాతీయ కమిటీలో చోటు దక్కడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. మహిళా సమస్యలపై ఆమెకున్న అవగాహన, సామాజిక అంశాలపై ఆమె చూపుతున్న చొరవ దృష్ట్యా ఈ కమిటీలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య సేవలు ఎంతో కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. మహిళల సాధికారత, భద్రత, ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశాలను కమిటీలో బలంగా ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

తెలంగాణ, ముఖ్యంగా వరంగల్ ప్రాంత మహిళల సమస్యలను మరియు వారి అవసరాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించే అవకాశం లభించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.

Leave a Reply