చౌటుప్పల్‌లో నీటి ఎద్దడి రాకుండా పకడ్బందీ చర్యలు

చౌటుప్పల్‌లో నీటి ఎద్దడి రాకుండా పకడ్బందీ చర్యలు
- అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన తాగునీటి ఎద్దడిపై అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ఆర్‌డీఓ వి. శేఖర్ రెడ్డితో కలిసి వార్డుల వారీగా నెలకొన్న తాగునీటి సమస్యలపై కౌన్సిలర్లతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ.. వేసవి తీవ్రత దృష్ట్యా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులలోని ప్రజలకు సమానంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని చైర్‌పర్సన్‌కు స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్, ఏఈ, వాటర్ మెన్లు నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
6 అదనపు వాటర్ ట్యాంకర్లు లీజుకు తీసుకుంటున్నాం: చైర్‌పర్సన్
మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టణంలో నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సమృద్ధిగా నీరు ఉన్న బోర్లను గుర్తించామని, నీటి లభ్యత తక్కువగా ఉన్న చోట ప్రైవేట్ బోర్లను లీజుకు తీసుకున్నామని తెలిపారు. వీటికి అదనంగా మరో 6 నీటి ట్యాంకర్లను లీజుకు తీసుకుని ప్రజలకు ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా నిరంతర సరఫరాకు హామీ ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలోని టెక్నికల్ టీమ్, వాటర్ మెన్లతో కలిసి తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ అత్యవసర సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే అధికారుల విభాగం నుండి ఆర్‌ఓ అంజయ్య, ఏఈ నితీష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, టీడబ్ల్యూఐ సంతోష్ కుమార్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
