ఆ గ్రామంలో హిజ్రాలకు నో ఎంట్రీ.. అసలు కారణం ఇదే.. !
ఆ గ్రామంలో హిజ్రాలకు నో ఎంట్రీ.. అసలు కారణం ఇదే.. !
- వేధింపులు భరించలేకే నిర్ణయం
- గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)వెల్లడి
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామంలో హిజ్రాల ప్రవేశంపై గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామంలోకి హిజ్రాలు రావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
వేలల్లో డిమాండ్.. తప్పని ఇబ్బందులు
గ్రామంలో ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా.. పండంటి బిడ్డ జన్మించినా హిజ్రాలు గుంపులుగా వచ్చి వసూళ్లకు పాల్పడు తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేడుకల సమయంలో వేల రూపాయలు ఇవ్వాలంటూ పట్టుబట్టడం, ఇవ్వని పక్షంలో అసభ్య పదజాలంతో దూషిస్తూ, నానా హంగామా చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని వీడీసీ దృష్టికి తీసుకెళ్లారు.
వీడీసీ స్పష్టత..
గ్రామస్తుల ఫిర్యాదులు, వారి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కమిటీ, ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు మోర్తాడ్ లింబాద్రి మాట్లాడుతూ.. శుభకార్యాల వేళ సామాన్యులను ఇబ్బంది పెడుతూ, భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న హిజ్రాల ఆగడాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామస్తులందరూ ఈ తీర్మానానికి కట్టుబడి ఉండాలని ఎవరూ కూడా హిజ్రాలను ప్రోత్సహించకూడదని అన్నారు. ఈ నిర్ణయంతో గ్రామంలో నెలకొన్న వేధింపులకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ తీర్మానం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
