తీవ్రంగా గాయపడిన టెన్త్ విద్యార్థి
కర్రలు, ప్లేట్లతో కొట్టి.. బూట్లతో ముఖంపై తొక్కిన తోటి విద్యార్థులు
12 మంది విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన అభిషేక్
మెట్లపై నుంచి పడిపోయాడంటూ తల్లిదండ్రులకు సమాచారం
ఇంటికి తీసుకురాగా అసలు విషయం చెప్పిన బాధిత విద్యార్థి
ర్యాగింగ్ పేరుతో సీనియర్లు దాడి చేశారని ఆరోపణ
విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్
ఘటనను దాచేందుకు ప్రయత్నించారంటూ పాఠశాల యాజమాన్యంపై ఆరోపణలు
పోలీసులను ఆశ్రయించిన బాధిత విద్యార్థి తల్లిదండ్రులు
మేడ్చల్–మల్కాజిగిరి, ఆంధ్రప్రభ: పాఠశాల అంటే విద్యార్థులకు భద్రత కల్పించే ప్రదేశం కావాలి. కానీ అక్కడే ఓ విద్యార్థి తోటి విద్యార్థుల దాడికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపుతోంది. ర్యాగింగ్ పేరుతో పదో తరగతి విద్యార్థిపై 12 మంది తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్లో వెలుగులోకి వచ్చింది.
కామారెడ్డి జిల్లాకు చెందిన అభిషేక్ అనే విద్యార్థి దమ్మాయిగూడ శ్రీచైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. రాత్రి సమయంలో హాస్టల్లో ఉన్న అభిషేక్‌పై కొంతమంది సీనియర్ విద్యార్థులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కర్రలు, ప్లేట్లతో విచక్షణారహితంగా కొట్టడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కారని తెలిపారు.
ఈ దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే విషయం బయటకు రాకుండా ఉండేందుకు పాఠశాల యాజమాన్యం సరైన సమాచారం ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు మెట్లపై నుంచి జారి కిందపడిపోయాడని పాఠశాల సిబ్బంది ఫోన్ చేసి చెప్పారని, వెంటనే పాఠశాలకు వెళ్లి బాలుడిని ఇంటికి తీసుకొచ్చామని వారు తెలిపారు.
ఇంటికి తీసుకొచ్చిన అనంతరం కుమారుడిని ప్రశ్నించగా.. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు తనపై దాడి చేశారని అభిషేక్ చెప్పినట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం తీవ్ర గాయాలతో అభిషేక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమారుడిపై దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు ఘటనను దాచేందుకు ప్రయత్నించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. విద్యార్థుల భద్రత, హాస్టళ్లలో పర్యవేక్షణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల రక్షణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.
