సకాలంలో వర్షాలు కురవాలని వరుణయాగం..
నంద్యాల, ఆంధ్రప్రభ : అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఐదు రోజులపాటు నిర్వహిస్తున్న వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం వేకువజామున నుంచి వివిధ పూజలు, పారాయణాలు, హోమాలు నిర్వహించారు.
ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, మహాన్యాస పారాయణం, రుద్ర పారాయణం, కాఠక శతానువాక పారాయణం, వేద పారాయణాలు, వారుణానువాక సహిత ఋష్యశృంగ పారాయణం, రుద్రహోమం, చండీ పారాయణం, శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. కృష్ణవేణీ పుణ్యనదీ జలాలతో పాటు ఆలయ ప్రాంగణంలోని మల్లికాగుండ పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు.

కార్యక్రమంలో ఋష్యశృంగ జపం, వారుణానువాక పారాయణాలు, వరుణ జపం, భాగవతం, విరాటపర్వ పారాయణాలు, పంచాక్షరీ జపాలు కొనసాగుతున్నాయి. దేవస్థానం అర్చకస్వాములు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 36 మంది ఋత్వికులు పాల్గొంటున్నారు.
ఆరుద్రోత్సవ పూజాదికాల అనంతరం అర్చకస్వాములు సహస్ర ఘటాభిషేక సంకల్పాన్ని పఠించారు. సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, చెరువులు, జలాశయాల్లోకి సమృద్ధిగా నీరు చేరాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని సంకల్పించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని మహాగణపతి పూజ నిర్వహించారు.
తర్వాత అర్చకస్వాములు పాతాళగంగ వద్ద కృష్ణవేణీ నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలశాల్లో పవిత్ర జలాలను తీసుకువచ్చారు. దేవాదాయ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ అజాద్, అర్చకస్వాములు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా కృష్ణవేణీ నదీ జలాలతో పాతాళేశ్వరస్వామివారి ఆలయంలో అభిషేకాది అర్చనలు నిర్వహించారు.
అనంతరం జలకలశాలను తలపై ధరించి వేదమంత్రాలు, భజంత్రీల నడుమ నందిఆలయానికి చేరుకున్నారు. అక్కడ నందీశ్వరస్వామివారికి, అనంతరం గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి, క్షేత్రపాలకుడు వీరభద్రస్వామివారికి అభిషేకాది అర్చనలు చేశారు. అనంతరం జలకలశాలతో ప్రధానాలయానికి చేరుకున్నారు.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన ప్రధాన కలశాలు, ఇతర కలశాలు, కృష్ణవేణీ నదీ జల కలశాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం ప్రారంభించారు. అభిషేకం పూర్తయ్యే వరకు అర్చకస్వాములు నిరంతరాయంగా రుద్రమంత్రాలను పఠించనున్నారు. అనంతరం మహానివేదన, నీరాజనం, మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సహస్ర ఘటాభిషేకం సందర్భంగా స్వామివారి గర్భాలయానికి అడ్డంగా మూడు అడుగుల మేర తాత్కాలిక గోడను నిర్మించారు. దీంతో సోమవారం రోజంతా స్వామివారు ఘటాభిషేక జలంలోనే ఉండేలా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, బి. రవణమ్మ, చిట్టిబొట్ల భరద్వాజశర్మ, జి. లక్ష్మేశ్వరి, శ్రీదేవి, వెంకటేశ్వర్లు, మేడా మురళీధర్, యు. సుబ్బలక్ష్మి, జిల్లెల శ్రీదేవి, ప్రత్యేక ఆహ్వానితులు కారుపర్తి నాగమల్లేశ్వరరావు, ఆకుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
