SRH vs GT | ఆరెంజ్ ఆర్మీకి మ‌రోషాక్.. టాప్ లేపిన టైట‌న్స్ !!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సూపర్ విక్టరీ సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించిన గుజరాత్.. హైదరాబాద్ సొంత మైదానంలోనే ఎస్‌ఆర్‌‌హెచ్‌ను మట్టికరిపించింది.

ఎస్‌ఆర్‌‌హెచ్ నిర్ధేశించిన 153 పరుగుల ఛేదనలో గుజరాత్ టైటన్స్ బ్యాటర్లు టాప్ లేపారు. ఓపెనర్ గా బరిలోకి వచ్చిన శుభమన్ గిల్ ( 43 బంతుల్లో 9ఫోర్ల‌తో 61నాటౌట్ ) కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. గిల్ కి తోడుగా.. వాషింగ్ ట‌న్ సుంద‌ర్ (29 బంతుల్లో 5ఫోర్టు, 2సిక్సుల‌తో 49) ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించాడు. ఇక ఆఖ‌ర్లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (16 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సుతో 35నాటౌట్) దంచికొట్టాడు. దీంతో గుజ‌రాత్ జ‌ట్టు 7 వికెట్ల‌తో హైద‌రాబాద్ ను చిత్తు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో మహ్మ‌ద్ ష‌మీ రెండు వికెట్లు తీయ‌గా.. కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

అంత‌క‌ముండు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆరెంజ్ ఆర్మీని.. గుజ‌రాత్ బౌల‌ర్లు వ‌ణికించారు. సన్‌రైజర్స్‌ కు గుజరాత్‌ టైటాన్స్‌ స్పీడ్‌స్టర్‌ మహ్మద్‌ సిరాజ్ ఆదిలోనే ఊహించని షాకులిచ్చాడు. సిరాజ్ తో పాటు, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, సాయి కిషోర్ లు కూడా అద్బుత బౌలింగ్ తో ఎస్ఆర్‌‌హెచ్‌ను కట్టడి చేశారు.

దీంతో విధ్వంసకర ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (8), మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (18), వన్‌డౌన్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (17) కూడా భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు.

ఈ దశలో యువ ఆల్‌రౌండర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి(31)తో కలిసి హెన్రిచ్‌ క్లాసెన్ (27) హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరు నాలుగో వికెట్‌కు కీలకమైన 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని గుజరాత్‌ బౌలర్లు విడదీశారు.

తర్వాత వచ్చిన యువ హిట్టర్‌ అనికేత్‌ వర్మ (18), చివర్లో కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (22 నాటౌట్‌), షమీ కూడా రెండు బంతుల్లో 6 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 152/8 స్కోరు సాధించింది.

ఇక ఈ విజ‌యంతో పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో ఉండే టైట‌న్స్ ఆర్సీబీని కింద‌కు నెట్టి.. రెండో స్థానానికి చేరుకుంది.

Leave a Reply