దెబ్బతిన్న రహదారుల అభివృద్ధి కోసం..

దెబ్బతిన్న రహదారుల అభివృద్ధి కోసం..
నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ నియోజకవర్గంలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారులు, భవనాల శాఖ ద్వారా మొత్తం రూ.240 లక్షల నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేయబడినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న ప్రధాన జిల్లా రహదారులు, రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ నిధులు కేటాయించబడినట్లు ఆమె తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
మంజూరైన పనుల వివరాలు..
జాతీయ రహదారి 65 నుండి కంచికచర్ల – ఎస్. అమరావరం రహదారి (కిలోమీటరు 0.0 నుండి 5.3 వరకు) అభివృద్ధికి రూ.210 లక్షలు మంజూరు..
జాతీయ రహదారి 65 నుండి కంచెల రహదారి (కిలోమీటరు 0.0 నుండి 6.8 వరకు) పనులకు రూ.30 లక్షలు కేటాయింపు..
ఈ రెండు కీలక రహదారులు స్థానిక రవాణా వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందున, వీటి అభివృద్ధి పూర్తయిన తర్వాత ప్రజలకు ప్రయాణ సౌలభ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థుల ప్రయాణం, అత్యవసర వైద్య సేవలకు ఈ మార్గాలు కీలకంగా ఉపయోగపడతాయి.
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. నందిగామ అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సంబంధిత మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)లకు కృతజ్ఞతలు తెలిపారు. రహదారుల మెరుగుదలతో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, వాణిజ్య, విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
