Telegram Ban Lifted | జూన్ 22తో ముగిసిన తాత్కాలిక నిషేధం
Telegram Ban Lifted | జూన్ 22తో ముగిసిన తాత్కాలిక నిషేధం
Telegram Ban Lifted | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టెలిగ్రామ్ యాప్‌పై విధించిన తాత్కాలిక ఆంక్షలు ముగియడంతో ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ వేదిక మళ్లీ అందుబాటులోకి వచ్చింది. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం జూన్ 22తో ముగియడంతో, ఇవాళ ఉదయం నుంచి గూగుల్ ప్లాట్‌ఫామ్‌లో టెలిగ్రామ్ సేవలు పునరుద్ధరించబడ్డాయి.
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ, నకిలీ పత్రాల సృష్టి, తప్పుడు సమాచారం వ్యాప్తి, పరీక్షా ప్రక్రియను ప్రభావితం చేసే మోసపూరిత కార్యకలాపాల్లో టెలిగ్రామ్ ఛానెళ్లు, గ్రూపులు కీలక పాత్ర పోషించాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. పరీక్షల పారదర్శకతను కాపాడటం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
ఆంక్షల కారణంగా లక్షలాది మంది వినియోగదారులు టెలిగ్రామ్ సేవలను ఉపయోగించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార అవసరాల కోసం టెలిగ్రామ్‌ను వినియోగించే వర్గాలపై దీని ప్రభావం కనిపించింది.
అయితే తాత్కాలిక నిషేధ కాలం ముగియడంతో గూగుల్ మళ్లీ టెలిగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం యాప్ సాధారణంగా పనిచేస్తుండగా, వినియోగదారులు తమ ఖాతాలను యథావిధిగా ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, టెలిగ్రామ్ వేదికను అక్రమ కార్యకలాపాలకు వినియోగించకుండా మరింత కఠిన పర్యవేక్షణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల భద్రత, డిజిటల్ వేదికల బాధ్యతాయుత వినియోగం అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి.
