ఉపాధ్యాయుల సర్దుబాటు చర్యలు చేపట్టాలి
- పీడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు పంగ రవి
ఆలేరు, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ)రాష్ట్ర అధ్యక్షులు పంగ రవి గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయుడు ఒక్కడే ఉన్నచోట విద్యార్థులకు సరియైన పద్ధతుల్లో బోధన చేయడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇందువల్ల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు.
జిల్లాల వారీగా తక్కువ విద్యార్థులు ఉండి,ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న చోటు నుండి విద్యార్థులు ఎక్కువ ఉండి ఉపాధ్యాయులు ఒక్కరు ఉన్నచోటికి సర్దుబాటుకు చర్యలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ సర్దుబాటు చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య ధోరణని అన్నారు. వెంటనే ఉపాధ్యాయుల సర్దుబాటు చర్యలు చేపట్టి,సమస్య పరిష్కారం కోసం అధికారులు స్పందించాలని కోరారు. విద్యా శాఖలో ఖాళీగా ఉన్నటువంటి బోధన, బోధనేతర సిబ్బందిని తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
