కులగణనపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బీసీల విజయం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు బీసీ కులగణన నిర్వహించాలనే డిమాండ్‌కు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు,ఆదేశాలు బీసీల ఉద్యమాలకు నైతిక బలాన్ని చేకూర్చాయని బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రం నల్లబెల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత నాలుగున్నర దశాబ్దాలుగా బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా కులగణన కోసం అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.

స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వాలు కులగణన చేపట్టకపోవడం వల్ల బీసీల అసలు జనాభా,వారి సామాజిక-ఆర్థిక స్థితిగతులు వెలుగులోకి రాలేదన్నారు.1931లో బ్రిటిష్ పాలనలో జరిగిన కులగణనే చివరిదిగా నిలిచిపోయిందని గుర్తుచేశారు.1953లో కాకా కాలేల్కర్ కమిషన్, 1979లో బీపీ మండల్ కమిషన్ ఏర్పాటైనా వాటి సిఫారసులు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.అనంతరం మాజీ ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయడానికి ప్రయత్నించిన సమయంలో తీవ్ర వ్యతిరేకత ఎదురైందని పేర్కొన్నారు.

ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతే బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లే, బీసీలకు కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి, ఆ ఆధారంగా పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

2019లో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ, బీసీల కులగణన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఆలస్యం చేయకుండా జనాభా లెక్కలతో పాటు బీసీ కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.అలాగే తేలిన గణాంకాల ఆధారంగా బీసీలకు సముచిత రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.బీసీలంతా ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు మాత్రమే భావితరాలకు నిజమైన సామాజిక న్యాయం అందుతుందని కుమారస్వామి పేర్కొన్నారు.

Leave a Reply