Stock Market | 800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..

Stock Market | 800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..

Stock Market | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ భయాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తాజా ఘర్షణల నేపథ్యంలో సోమవారం మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరగడంతో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు పతనమైంది. ఉదయం ప్రారంభ‌ సమయానికి సెన్సెక్స్ 675 పాయింట్లు నష్టపోయి 73,567 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 23,150 వద్ద కొనసాగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.35 వద్ద నమోదైంది.

నిఫ్టీ సూచీలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు విప్రో, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్యారెల్ చమురు ధర మూడు శాతం మేర ఎగిసి 96 డాలర్లకు పైగా చేరుకుంది. చమురు ధరల పెరుగుదలతో పాటు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మార్కెట్ల పతనానికి కారణమవుతోంది.

Leave a Reply