క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది…
క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది…
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కర్నూలు స్టేడియం అభివృద్ధి..
స్పోర్ట్స్ హాస్టల్‌ను కర్నూలులోనే కొనసాగిస్తాం: మంత్రి టీజీ భరత్..
యువత ప్రతిరోజూ క్రీడల్లో పాల్గొనాలి: ఎంపీ బస్తిపాటి నాగరాజు..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, కర్నూలు స్టేడియాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. సోమవారం కర్నూలు నగరంలోని సమ్మర్ కోచింగ్ క్యాంపును మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, శాప్ చైర్మన్ రవి నాయుడు కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా క్యాంపులో శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో మంత్రి ముచ్చటించి వారి ప్రతిభను అభినందించారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వ్యాయామం, క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. వ్యాయామం చేసే వారు శారీరకంగా, మానసికంగా మరింత ఉత్సాహంగా ఉండి తమ పనులను అధిక సామర్థ్యంతో నిర్వహించగలరని తెలిపారు.

స్పోర్ట్స్ హాస్టల్ తరలింపు ఉండదు..
కర్నూలు స్పోర్ట్స్ హాస్టల్‌ను ఎక్కడికీ తరలించే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. హాస్టల్‌ను మరింత ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కర్నూలు స్టేడియంలో ప్రపంచ స్థాయి క్రీడా వసతులు కల్పించే దిశగా ఇప్పటికే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గరంలోని పార్కులను కూడా వ్యాయామానికి అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నామని, యువత క్రీడలను కెరీర్‌గా తీసుకుంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని మంత్రి హామీ ఇచ్చారు. టీజీవీ గ్రూప్ తరఫున దశాబ్దాలుగా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నామని, ప్రతిభ కలిగిన యువతకు అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.
కర్నూలులో అత్యుత్తమ క్రీడా వసతులు..
ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలను సందర్శించినప్పటికీ కర్నూలులో ఉన్న స్థాయి క్రీడా వసతులు మరెక్కడా కనిపించలేదని శాప్ చైర్మన్ రవి నాయుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు మంత్రి టీజీ భరత్‌తో కలిసి స్టేడియాన్ని పరిశీలించినప్పుడు ఇచ్చిన హామీల మేరకు ప్రస్తుతం అత్యాధునిక సింథటిక్ ట్రాక్ ఏర్పాటు కావడం జరిగిందన్నారు.
క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి తన వంతు సహకారంగా ఎంపీ నిధుల నుంచి రూ.15 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. యువత చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
50 సమ్మర్ క్యాంపులతో యువతకు అవకాశం..
శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులు యువత ప్రతిభను వెలికితీసే గొప్ప వేదికలని పేర్కొన్నారు. ఈ క్యాంపుల ద్వారా అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శాప్ ఆధ్వర్యంలో 50 సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తుండగా, కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మరో 25 క్రీడా శిబిరాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ప్రతి క్యాంపుకు రూ.10 వేల చొప్పున నిధులు కేటాయించి, క్రీడాకారులకు చిక్కీ, ప్రత్యేక డైట్ సదుపాయాలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం యువత చిన్న విషయాలకే నిరుత్సాహానికి గురవుతున్న తరుణంలో గెలుపోటములను సమానంగా స్వీకరించే మనోధైర్యం కేవలం క్రీడల ద్వారానే వస్తుందని పేర్కొన్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని అన్నారు.
క్రీడా పరికరాల పంపిణీ…
అనంతరం సమ్మర్ కోచింగ్ క్యాంపులో పాల్గొంటున్న క్రీడాకారుల మెరుగైన శిక్షణ కోసం అవసరమైన క్రీడా పరికరాలను మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, శాప్ చైర్మన్ రవి నాయుడు క్యాంప్ ఇన్చార్జిలకు అందజేశారు. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ భరణి, సెక్కుర్ సీఈవో డాక్టర్ వేణుగోపాల్, డీఎస్డీవో భూపతిరావు, సాయి స్పోర్ట్స్ హాస్టల్ ఇన్చార్జి కార్తికేయన్, స్కూల్ గేమ్స్ కార్యదర్శి కృష్ణ, కోచ్‌లు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
