Rs1.50 lakh cr | సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Rs1.50 lakh cr | సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Rs1.50 lakh cr | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు ప్రాజెక్టు వెనుక ఉన్న నిజాలు తెలియకూడదనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఇప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. మంత్రులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం రేవంత్.. అనంతరం ఎల్ అండ్ టీ అతిథిగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

బ్యారేజీలో లోపాలున్నాయని 2020లోనే ఇంజనీర్లు లేఖల ద్వారా హెచ్చరించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అయితే, ఆ నివేదికలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎల్ అండ్ టీ అధికారులు కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రాజెక్టు వైఫల్యాలను, లోపాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని మండిపడ్డారు.

“2018 ఎన్నికల్లో కాళేశ్వరాన్ని చూపించి ఓట్లు దండుకుని గత ప్రభుత్వం లబ్ధి పొందారని, రూ. 1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులో ఇప్పటికే రూ. లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసిన ప్రాజెక్టు ద్వారా కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్న ప్రాజెక్టును ఇలా వదిలేయలేం” అని సీఎం స్పష్టం చేశారు.

Rs1.50 lakh cr | సీబీఐ విచారణకు డిమాండ్..

మేడిగడ్డ అవకతవకల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సీబీఐ విచారణను ప్రారంభించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఇటీవలే కేంద్రానికి మరో లేఖ కూడా రాసినట్లు ఆయన వెల్లడించారు. అన్నీ దాచిపెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ సభలు పెడుతున్నారని, వాస్తవాలను చూసి జనం అసహ్యించుకుంటున్నారని సీఎం విమర్శించారు.

Leave a Reply