విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి..
- ప్రలోభాలకు లోనుకాకుండా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి
- చౌటుప్పల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
- విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ
- చౌటుప్పల్ సిఐ మన్మధ కుమార్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ (సిఐ) జి. మన్మధ కుమార్ పిలుపు నిచ్చారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ తీసుకోవాలని ప్రలోభపెడితే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
సోషల్ మీడియా ప్రలోభాలకు లోనవ్వద్దు..

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ద్వారా వచ్చే తప్పుడు ప్రలోభాలకు, ఆకర్షణలకు విద్యార్థులు లోనుకావద్దని సిఐ హెచ్చరించారు. మంచి స్నేహితులను ఎంచుకుంటూ.. చదువు, క్రీడలు, ఇతర సృజనాత్మక (క్రియేటివ్) కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి మద్దతుగా డ్రగ్స్ రహిత సమాజం కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. “నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఎవరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తాను. డ్రగ్స్ అమ్మకం, అక్రమ రవాణా చేసే వారి సమాచారాన్ని అధికారులకు అందిస్తాను” అంటూ విద్యార్థులందరూ చేతులు చాచి ఘనంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అజయ్ భార్గవ్ తో పాటు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
