దళితుల ఆత్మగౌరవం మీద ఘోర దాడి..!

దళితుల ఆత్మగౌరవం మీద ఘోర దాడి..!
అనంతపురం, ఆంధ్రప్రభ : శ్రీ గీతం కాలేజీ చైర్మన్ మనీషా నాయర్ తో పాటు 10 మంది రౌడీలు సీనియర్ విలేకరి కొత్తూరు లక్ష్మీనారాయణ భార్య మైనర్ కుమారుడిపై దారుణంగా దాడి చేసినారని న్యాయవాది బహుజన సమాజ్ పార్టీ నాయకుడు పి.ఎస్.హరి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులు అయినా అనంతపురం పోలీసులు కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.కేవలం బెయిల్ సెక్షన్లలో కేసు నమోదు చేసి నిందితులు ఉపయోగించిన వాహనాలు సెల్‌ఫోన్లు సీజ్ చేయకపోవడం సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించకపోవడం చూస్తుంటే పోలీసులు పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఇది ఒక వ్యక్తి మీద దాడి కాదు.అనంతపురం జిల్లాలోని సుమారు 10 లక్షల మంది ఎస్సీ దళిత జనాభా ఆత్మగౌరవం మీద జరిగిన స్పష్టమైన దాడి అని చెప్పారు.కేరళ నుంచి వచ్చిన వ్యక్తులు రాయలసీమ దళితులపై దాడి చేస్తే ప్రభుత్వం మరియు పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? దళితులు ఓట్లు వేసి గెలిపించిన 14 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్న కూటమి ప్రభుత్వం దళితుల రక్షణకు ఎందుకు ముందుకు రావడం లేదు?దళితులపై దాడి చేస్తే బెయిలబుల్ కేసులు పెట్టి వదిలేస్తామని పోలీసులు ప్రజలకు ఇస్తున్న సందేశం ఏమిటి? అని ప్రశ్నించారు.
నిందితులైన మనీషా నాయర్ ఆమె తండ్రి మరియు ఇతర రౌడీలపై తక్షణం నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. దాడికి ఉపయోగించిన వాహనాలు సెల్‌ఫోన్లు సీజ్ చేసి సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకొని నిష్పక్షపాత విచారణ జరపాలి.సీనియర్ విలేకరి కొత్తూరు లక్ష్మీనారాయణ అతని కుటుంబ సభ్యులకు తక్షణం భద్రత కల్పించాలి.ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీ స్థాయిలో తక్షణం సమీక్ష నిర్వహించి దళితులకు సంపూర్ణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
