Phone Tapping | జూన్ 20వ తేదీలోగా కోర్టు ముందు హాజ‌రుకండి – ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు ఆదేశం

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావుకు నాంపల్లిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 20వ తేదీలోగా కోర్టు ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది.

గడువులోగా ప్రభాకర్ రావు కోర్టు ముందు హాజరుకాని పక్షంలో ఆయనను ‘ప్రొక్లెయిమ్డ్ అఫెండర్’ (ప్రకటిత నేరస్థుడు)గా పరిగణిస్తామని కోర్టు హెచ్చరించింది. ఈ ఏడాది జనవరిలోనే ప్రభాకర్‌రావుతో పాటు మరో నిందితుడు ఎ. శ్రవణ్ కుమార్‌రావును ప్రొక్లెయిమ్డ్ అఫెండర్లుగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతించాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీరిద్దరూ విదేశాలకు పారిపోయారని, అధికారిక నోటీసులను పట్టించుకోకుండా అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రవణ్ కుమార్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తనను అరెస్టు చేయరనే షరతుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యేందుకు శ్రవణ్‌కుమార్ అంగీకరించారు. ప్రభాకర్‌రావు విషయంలో మాత్రం ప్రొక్లమేషన్ ప్రక్రియను కొనసాగించేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగానే, ప్రభాకర్‌రావు స్వచ్ఛందంగా హాజరయ్యేందుకు జూన్ 20ని తుది గడువుగా నిర్దేశించింది. ఒకవేళ ఆయన ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే, అభియోగాలు నమోదు చేసిన 90 రోజుల తర్వాత ఆయన గైర్హాజరీలోనే విచారణ జరిపే అవకాశం ఉందని కోర్టు తెలిపింది.

శ్రవణ్ కుమార్ కస్టడీ పిటిషన్‌పై ఉత్కంఠ
మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్‌రావుపై మరో మోసం కేసు కూడా నమోదైంది. ఐరన్ ఓర్ కొనుగోలు పేరిట అఖండ్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను శ్రవణ్ కుమార్, ఆయన అనుచరులు రూ.6.58 కోట్లకు పైగా మోసం చేశారని ఆ సంస్థ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ చీటింగ్ కేసుకు సంబంధించి శ్రవణ్ కుమార్‌ను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఈ కేసులో శ్రవణ్ కుమార్‌ను విచారించేందుకు కస్టడీ అవసరమని పోలీసులు కోరారు.

Leave a Reply