స్వచ్ఛ నంద్యాల కోసం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’..

స్వచ్ఛ నంద్యాల కోసం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’..

ప్రజల భాగస్వామ్యానికి కలెక్టర్ పిలుపు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా కేంద్రమైన నంద్యాలను పరిశుభ్రంగా, సుందరంగా, ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా నగర్–గవర్నమెంట్ హాస్పిటల్ లైన్ ప్రాంతంలో నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణంలో ఎక్కడెక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయాయో గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో తొలగించడం, పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. పరిశుభ్రతను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో సాధించాల్సిన సామూహిక కర్తవ్యంగా భావించాలని సూచించారు.

పట్టణ పరిధిలో రోజువారీగా అధిక మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ఆసుపత్రులు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వంటి బల్క్ వేస్ట్ జనరేటర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ వివరించారు. ఇటువంటి సంస్థలు తప్పనిసరిగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని సూచించారు.

తడి చెత్తను స్థానికంగానే కంపోస్టింగ్ చేసి సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చని, అలా చేయలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన బయోడైజెస్టర్ యూనిట్లకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు సంబంధిత సంస్థలకు అవగాహన కల్పిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తున్నామని చెప్పారు.

“ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం ఒక ప్రత్యేక థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ వారం ‘బల్క్ వేస్ట్ జనరేటర్లకు అవగాహన కల్పించడం’ అనే అంశాన్ని ప్రధాన థీమ్‌గా ఎంపిక చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోందని పేర్కొంటూ, దాని వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ సంచులు, మొక్కజొన్న ఆధారిత పర్యావరణహిత కవర్లు తదితర ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. ఈ విషయమై సంబంధిత సంస్థలకు అడ్వైజరీ నోట్లు కూడా జారీ చేసినట్లు తెలిపారు.

స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, అందమైన నంద్యాల నిర్మాణానికి ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వేయాలని, ఇంటి వద్దనే తడి–పొడి చెత్తను వేరు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply