ఇండియన్ ఐకాన్ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఐకాన్ టాక్ట్‌ఫుల్ స్కూల్‌ను నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న విద్యా సదుపాయాలు, ఆధునిక తరగతి గదులు, మౌలిక వసతులను అభినందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా పట్టణ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ఇటువంటి విద్యాసంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం కూడా అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు కలిసి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వివేక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య, బహుదూర్ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
