కూటమి పాలనలో నడుస్తున్న రౌడీ రాజ్యం

అమరావతి రైతుల సమస్యలపై పోరాటం ఆగదు
రైతులకు అండగా వెళ్తే దాడులు, తప్పుడు కేసులు…
అమరావతికి కాదు.. అక్కడ జరుగుతున్న అవినీతికే మా వ్యతిరేకం
మళ్లీ కమిటీ సభ్యులతో అమరావతికి వెళ్తాం
వైసీపీ అధికారంలోకి వస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవు
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్

ఆంధ్రప్రభ, విజయవాడ: రాష్ట్రంలో కూటమి పాలనలో రౌడీ రాజ్యం కొనసాగుతోందని, పరిస్థితులు ఒకప్పుడు బీహార్‌లో నెలకొన్న జంగిల్‌రాజ్‌ను తలపిస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. అమరావతిలో రైతులపై జరుగుతున్న అన్యాయాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన రైతు పరిరక్షణ కమిటీలో భాగంగానే తాము అక్కడికి వెళ్లామని తెలిపారు. భూములు ఇవ్వని రైతులపై చట్టపరమైన అండ లేకుండా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారి పక్షాన నిలవాలనే ఉద్దేశంతో అమరావతికి వెళ్లగా, అక్కడ పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారని ఆరోపించారు. వైసీపీ అమరావతికి వ్యతిరేకమని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాము ఎప్పుడూ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని అవినాష్ స్పష్టం చేశారు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, అక్రమాలకే తమ వ్యతిరేకత అని చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అమరావతి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నామని పేర్కొన్నారు. టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో కొందరు మద్యం తాగించి రాళ్లు, గుడ్లతో దాడులకు పాల్పడేలా చేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారందరినీ అమరావతి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. గత రెండేళ్లలో రైతులకు న్యాయం జరగలేదని, రాజధాని పరిసర ప్రాంతాల అభివృద్ధి కూడా కనిపించడం లేదన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం మళ్లీ కమిటీ సభ్యులతో అమరావతికి వెళ్తామని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గబోమని అవినాష్ స్పష్టం చేశారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఫిర్యాదును కూడా పోలీసులు సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ తండ్రి ఆశయాలకు అనుగుణంగా అమరావతి రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని, అమరావతి అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని దేవినేని అవినాష్ తెలిపారు.