ఏసీ రూముల్లో కూర్చుంటే రైతు సమస్యలు తీరవు..

ఏసీ రూముల్లో కూర్చుంటే రైతు సమస్యలు తీరవు..

  • ధాన్యం కొనుగోళ్లలో జాప్యమెందుకు
  • కలెక్టర్ లీవ్ లో వెళ్తే జిల్లా ఇంచార్జి ఎవరు..?
  • రైతులకు ఇబ్బంది తలెత్తితే ఎవర్ని ఉపేక్షించం
  • మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : అధికారులు ఏసీ రూముల్లో కూర్చుంటే రైతుల సమస్యలు తీరవని, ఫీల్డ్ లోకి వెళ్లి పనిచేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు, తరలింపులో జాప్యం పై అదనపు కలెక్టర్ నగేష్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ధాన్యం తరలింపు ప్రక్రియలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు చర్యలు తీసుకుంటే రైతులు ఎందుకు ఆగ్రహంతో రోడ్లమీదకు వస్తున్నారని ప్రశ్నించారు.

ఏసీ రూమ్ లో కూర్చుని మాట్లాడితే రైతుల సమస్యలు తీరవు అని, కాదు ఫీల్డ్ లో ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ నాలుగు రోజులుగా లీవ్ లో వెళ్తే ఇంచార్జిని నియమించలేదని, కలెక్టరేట్ కు, జిల్లాకు ఇంచార్జి ఎవరు అని అదనపు కలెక్టర్ ను ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యల పై కలెక్టర్ కు ఫోన్ చేసినా లేపడం లేదని, ఓ రైతు పెట్రోల్ తో వచ్చారని, ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాదిగా అహర్నిశలు రైతుల కోసం పని చేస్తుంటే అధికారులు ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. రైతే రాజు అనే విధముగా ప్రభుత్వం పనిచేస్తుందని, అధికారుల్లోనే లోపం ఉందని మండిపడ్డారు.

రైతులకు ఇబ్బంది కలుగనీయకూడదని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగళ్ళలో ఎందుకు జాప్యం జరుగుతుందని, ట్రాన్స్పోర్ట్ సమస్యకు ఎందుకు తలెత్తుతున్నాయని, రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారని అడిగారు. గతంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రైతుల విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సివిల్ సప్లై అధికారుల పై ఫిర్యాదులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

ఓట్లేసి గెలిపించిన ప్రజలు, రైతుల పక్షాన సమస్యల పై తప్పకుండా గళమెత్తుతామన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ సజావుగా నిర్వహిస్తామని, హమాలీల సమస్యను పరిష్కరిస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపడతామన్నారు. నాలుగైదు రోజుల్లో మరింత స్పీడ్ అప్ చేసి రైస్ మిల్లుల వద్ద అన్ లోడింగ్ ప్రక్రియను సైతం త్వరితగతిన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధికా భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు