ఆజాద్ సేవలు స్ఫూర్తిదాయకం
డి.ఆర్.ఓ కె.మోహన్ కుమార్
భారత విద్యా వ్యవస్థకు పునాది వేశిన మహనీయుడు
మైనారిటీ అధికారి కె.చిన్నారెడ్డి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా డిఆర్ఒ కె.మోహన్ కుమార్ ( K.Mohan Kumar) తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సచివాలయ సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఒ కె.మోహన్ కుమార్ మాట్లాడుతూ… మౌలానా ఆజాద్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, మహాకవిగా, విద్యావేత్తగా భారత చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఆయన విద్య ద్వారానే పేదరికం, నిరక్షరాస్యతలను తొలగించవచ్చని నమ్మారని చెప్పారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కె.చిన్నారెడ్డి (K.Chinna Reddy) మాట్లాడుతూ.. మౌలానా ఆజాద్ భారత విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన మహనీయుడు అని, హిందూ ముస్లిం ఐక్యత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. పదవీ విరమణ పొందిన విద్యాశాఖ అధికారి చిట్టి బాబు మాట్లాడుతూ ఆజాద్ యుజిసి, ఐఐటీ, ఐఐఎంల స్థాపనలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ (Andhra Pradesh State Urdu Academy) నిర్వహించిన రాష్ట్రస్థాయి రచనా పోటీల్లో ప్రతిభ కనబరిచిన సి.ఎం. ఫిర్దౌస్ బేగం (విజయం డిగ్రీ కాలేజ్, చిత్తూరు), కె.ఎం.ఐ. మహమ్మద్ ఇలియాస్ (ఎస్.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, పలమనేరు)లకు డిఆర్ఒ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.
కార్యక్రమం అనంతరం మైనారిటీ కమిటీ సభ్యులు, నాయకులు డిఆర్ఒ కె.మోహన్ కుమార్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎస్.రహిమాన్ బాయ్, బిసి కమిటీ సభ్యుడు జాకీర్, మయాన్ అర్షద్ అయూబ్ ఖాన్ అడ్వకేట్, టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు కాలేషా, టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం.డి. అన్సార్ బాషా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్.షంషీర్, బిజెపి ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, ఎస్.సి., ఎస్.టి. విజిలెన్స్ కమిటీ వి.రాజ్‌కుమార్, డివిఎంసి సభ్యుడు ఎస్.ముని స్వామి, మైనారిటీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


