మార్కాపురం ప్రమాద మృతదేహాలు బంధువులకు అప్పగింత

మార్కాపురం బ్యూరో, ఆంధ్రప్రభ : మార్కాపురం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను శనివారం పోలీసులు, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు.

జగిత్యాల నుంచి వింజమూరు వైపు ప్రయాణికులతో వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం సమీపంలో గురువారం ఉదయం ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు ఘటనాస్థలంలోనే పూర్తిగా కాలిపోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 28 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు, వైద్యులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మృతుల బంధువుల రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపగా, శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి డీఎన్‌ఏ ఫలితాలు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరాయి.

శనివారం ఉదయం మార్కాపురం సీఐ పి. సుబ్బారావు, ఎస్‌ఐ వేమన, డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అనంతరం అంబులెన్సుల ద్వారా మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది.
