సోలార్ మెగా పార్క్ కు ప్రధాని మోడీ వర్చువల్ శంకుస్థాపన

300 మెగావాట్ల సోలార్ విద్యుత్ పార్క్
(శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) రామగిరి మండలంలో సుమారు 1100 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న మెగా సోలార్ విద్యుత్ పార్క్ (Mega Solar Power Park) ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) గురువారం గుజరాత్ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం బాన్సువార నుంచి అణు, పునరుత్పాదక, విద్యుత్ ప్రసరణ, రైల్వే, ప్రజా మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంలో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి – SECI ) ఆధ్వర్యంలో… శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలంలో 1047 ఎకరాలలో నిర్మించనున్న 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌కు వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

రామగిరి మండలంలో ఏర్పాటు చేసిన ఈ వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ (Collector A. Shyam Prasad), సెకి వీసీ అండ్ ఎండీ కమలాకర్ బాబు, ధర్మవరం ఆర్డీఓ ఏ.మహేష్, సెకి ఈడి శివ శంకర్ నాయుడు, తాసిల్దారు రవి, సెకి అధికారులు, సిబ్బంది, మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ గా సోలార్ మెగా పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేసిన అనంతరం… కార్యక్రమం సభా వేదికలో తెలుగు, ఇంగ్లీష్, హిందీలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కలెక్టరు ఏ. శ్యాంప్రసాద్, సెకి వీసీ అండ్ ఎండీ కమలాకర్ బాబుతో కలిసి లాంఛనంగా ఆవిష్కరించారు.
దేశంలో రామగిరి వాసులు గర్వపడే ఒక చరిత్రాత్మక కార్యక్రమం ఇదని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అన్నారు. రామగిరి వాసులు అదృష్టవంతులు. రామగిరి పేరులో ఉన్న శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవారు. ఆ సూర్యుని ద్వారానే సోలార్ ఎనర్జీని తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి ఆ సూర్యుడు, శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడు రామగిరి ప్రజలపై ఉంటాయని పేర్కొన్న జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీసీ అండ్ ఎండి కమలాకర్ బాబు మాట్లాడుతూ… వర్షాభావం ఉండడం, పంటలు లేకపోవడం, భూములు ఎక్కువగా ఉండడం వల్ల రాయలసీమ ప్రాంతంలో భూమి ఎక్కువగా ఉంది. అందులోనూ పుట్టపర్తి జిల్లా రామగిరి ప్రాంతంలో 1047 ఎకరాలలో 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని ప్రధాని సంకల్పించడం ఈ ప్రాంత వాసుల అదృష్టం. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో వారికి దాదాపు 1000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ సందర్భంగా సోలార్ ఏర్పాటులో బాగా కృషిచేసిన అచీవర్స్ కు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.అలాగే కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ తో పాటు బహుమతులను కూడా కలెక్టర్ చేతుల మీదుగా అందచేశారు.
