Loksubha | క్షమాపణకు బీజేపీ డిమాండ్!

Loksubha | క్షమాపణకు బీజేపీ డిమాండ్!
ఆపరేషన్ సింధూర్‌ను హేళన చేస్తారా?
రాహుల్ వ్యాఖ్యలపై భగ్గుమన్న అధికార పక్షం!
Loksubha | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్‌సభలో నేడు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సభలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్డీయే సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో సభ గందరగోళంగా మారింది.
సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీని ఒక ‘మెజీషియన్’ (ఐంద్రజలికుడు) తో పోల్చారు. నోట్ల రద్దు, ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన మెజీషియన్, బిజినెస్‌మెన్ అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ తీరుపై స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా మర్యాదలకు లోబడి మాట్లాడాలని, అత్యున్నత పదవిలో ఉన్న వారిని గౌరవించాలని రాహుల్‌కు స్పీకర్ సూచించారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు భగ్గుమన్నారు. ప్రధాని మోదీని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ తక్షణమే సభకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ వంటి కీలక సైనిక ఆపరేషన్లను మ్యాజిక్‌తో పోల్చడంపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సైనికులను హేళన చేశారు – కిరణ్ రిజిజు:
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మన దేశ సైనికులను హేళన చేసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. “బిల్లుపై అర్థవంతమైన చర్చ జరిగితే మేము అడ్డుకోం, కానీ ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు సహించం” అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలన్నింటినీ సభ రికార్డుల నుంచి తొలగించాలని అధికార పక్షం స్పీకర్‌ను కోరింది.
ప్రస్తుతం సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాహుల్ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
