కూసుమంచిలో మద్యం సిండికేట్ దందా…
- వైన్‌షాపుల్లో స్టాక్ నిల్
- బెల్ట్ షాపుల్లో స్టాక్ ఫుల్
- క్వార్టర్‌కు రూ.20 నుంచి రూ.40 అధిక ధరలతో విక్రయాలు
- సిండికేట్‌గా చక్రం తిప్పుతున్న కూసుమంచి మద్యం డాన్
- చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఎక్సైజ్‌శాఖపై ఆరోపణలు
ఖమ్మం, ఆంధ్రప్రభ : పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో మద్యం వ్యాపారులు.. సిండికేట్‌గా మారి మద్యం దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలోని కొన్ని వైన్ షాపులు సిండికేట్‌గా మారి బెల్ట్ షాపులకు అధిక ధరలకు విక్రయిస్తూ దందా నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా నాలుగు వైన్‌షాపులకు చెందిన వ్యాపారులంతా వారి పరిధిలోని బెల్ట్ షాపులకు రూ.20 నుంచి రూ.40 వరకు ధరలు పెంచి విక్రయించటం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు వైన్‌షాపులు ఉండాల్సిన స్టాక్‌ను ఉంచడం లేదని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్‌షాపులో లభించని అన్ని రకాల బ్రాండ్లు బెల్ట్ షాపుల్లో లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బెల్ట్ షాపులను ప్రోత్సహించడం.. అధిక ధరలకు మద్యం విక్రయించడంతో సిండికేట్ లాభపడుతూనే, అదే సమయంలో ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టాన్ని కలిగిస్తోందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు మద్యం ప్రియులకు ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మార్పీ ధరలకు లభించాల్సిన మద్యం దొరక్క బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ప్రతీ ఏటా కోట్ల రూపాయల సిండికేట్ దందా జరుగుతుందని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్‌షాపుల్లో విక్రయించాల్సిన మద్యంను విక్రయించకుండా… బెల్ట్ షాపులకు అధిక ధరలకు విక్రయించి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఖజానాకు గండికొడున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గ్రామాల్లో బెల్ట్ షాపుల కారణంగా… అనేక ఇబ్బందులు వస్తున్నాయని గ్రామీణ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. గ్రామాల్లో అర్ధరాత్రి బెల్ట్ షాపుల మద్యం అమ్మకాల వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అర్ధరాత్రులు మద్యం సేవించి ఆకతాయిలు వివాదాలు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారనే సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.
సిండికేట్ కంట్రోల్ ఒక్కరి చేతిలోనే…
పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో నాలుగు వైన్‌షాపులు సిండికేట్‌గా మారి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలు మండలంలో జోరుగా చర్చ సాగుతున్నాయి. ఒక సిండికేట్ డాన్ పూర్తిగా కంట్రోల్ చేస్తూ… ఆ సిండికేట్ మొత్తాన్ని నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
కుసుమంచి మండలానికి చెందిన ఒక స్థానిక మద్యం సిండికేట్ నాయకుడు, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారుల మన్ననలు పొంది వారిపై పూర్తి పట్టు సాధించాడని… దాంతో ఆ శాఖలన్నీ తన గుప్పిట్లో ఉన్నాయనే భావనను కలిగిస్తున్నాడని… అలాగే ఈ ప్రభావాన్ని ఉపయోగించి ఇతర మద్యం వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని చాలామంది ఆరోపిస్తున్నారు.
వైన్ షాపులకు వచ్చిన మద్యంను వారి సిండికేట్‌కు అనుగుణంగా ఉన్న బెల్ట్ షాపులకు రూ.20 నుంచి రూ.40 అధిక ధరలకు విక్రయిస్తూ వైన్ షాపుల్లో ఉండాల్సిన మద్యాన్ని బెల్ట్ షాపులకు అధిక ధరలకు తరలిస్తున్నారని ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నా.. ఏ ప్రభుత్వ శాఖ కూడా వాటిపై చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో అశాంతి..
గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామీణ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. మద్యం సిండికేట్ డాన్ గ్రామీణ ప్రాంతాల్లో తన అనుచరులతో అనేక బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేయించి అధిక ధరలకు మద్యం విక్రయించడం చేస్తున్నారని కూసుమంచి మండలంలోని పలు గ్రామీణ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.
బెల్ట్ షాపుల వల్ల అర్ధరాత్రులు ఫూటుగా మద్యం సేవించి కొందరు ఆకతాయిలు సామాన్య ప్రజలపై దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. బెల్ట్ షాపులు ఎల్లవేళలా మద్యం విక్రయించడంతో గ్రామాల్లో అశాంతి వాతావరణం నెలకొంటుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
సంబంధిత శాఖల అధికారులు గ్రామస్తుల పదేపదే వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. కుసుమంచికి చెందిన ‘మద్యం మాఫియా డాన్’కు బలమైన రాజకీయ, అధికారిక అండదండలు ఉన్నాయని, అందుకే అతనిపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి.
