కమల్ హాసన్, త్రిష, శింబు, అభిరామిలాంటి వాళ్లు నటించిన థగ్ లైఫ్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రిలీజైన ట్రైలర్లో 70ఏళ్ల కమల్ హాసన్.. తన కంటే వయసులో ఎంతో చిన్నదైన అభిరామితో ఘాటు లిప్ లాక్ సీన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై తాజాగా హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో అభిరామి మాట్లాడింది.
ఇది అనవసర రాద్ధాంతం..
ఈ ముద్దు సీన్ పై అభిరామి స్పందించింది. “ఈ రోజుల్లో ప్రతిదీ వివాదమే అవుతోంది. దాని నుంచి తప్పించుకోలేం. ఆ సీన్ వెనుక మణి సర్ లాజిక్ ను నేను జడ్జ్ చేయడం లేదు. అతని లాజిక్ ఏదైనా.. దాంతో నేను ఏకీభవిస్తాను. కిస్సింగ్ సీన్ విషయానికి వస్తే కేవలం 3 సెకన్ల కిస్ అది. కేవలం అదే ట్రైలర్ లో చూపించేసరికి దానిని అపార్థం చేసుకున్నారు. సినిమాలో ఆ సీన్ చూస్తే.. అలా అనిపించదు. ఆ సీన్‌కు బాగా కుదిరింది. అనవసరంగా దీనిపై రాద్ధాంతం చేస్తున్నారు. సినిమాకు కలిసొచ్చేదే మార్కెటింగ్ టీమ్ చేస్తుందని నాకు తెలుసు. అయితే ఎలాంటి నిర్ణయానికి వచ్చే ముందు సినిమా చూడండని నేను ప్రేక్షకులను కోరుతున్నాను” అని అభిరామి చెప్పింది.

కమల్ ట్రాక్ రికార్డు వల్లేనా?
ఈ కిస్ వివాదం ఇంత పెద్దదిగా ఎందుకు మారిందన్న ప్రశ్నకూ అభిరామి స్పందించింది. “నిజంగా నాకు తెలియడం లేదు. ఇంతకుముందు కూడా కమల్ సార్ కు ఇలాంటి సీన్లలో ఉన్న ట్రాక్ రికార్డు వల్ల కావచ్చు. హే రామ్ మూవీలోలాగా. అందులో రాణి ముఖర్జీ, వసుధార దాస్ లతో ఇలాంటి సీన్లు ఎంతో అందంగా చేశారు. అతడో బోల్డ్ స్టోరీ టెల్లర్. అతడు ఎప్పుడు ఇలాంటి సీన్లు చేసినా వాటిపై ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలా అని మిగతా వాళ్లు ఇలాంటి సీన్లు చేయరని కాదు. కానీ ఓ టాప్ యాక్టర్ చేస్తే దాని గురించి మాట్లాడుకుంటారు. ఇది ఈ మధ్య కామనైపోయింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకులు కూడా పరిణతి సాధిస్తారు” అని అభిరామి చెప్పింది.
1987లో వచ్చిన నాయకుడు మూవీ తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేసిన మూవీ ఈ థగ్ లైఫ్. ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, నాజర్, జోజు జార్జ్ లాంటి వాళ్లు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.
