కర్నూలు దాహార్తికి ఊరట.. ఎల్‌ఎల్‌సీకి 900 క్యూసెక్కుల నీటి విడుదల

కర్నూలు రూరల్ (ఆంధ్రప్రభ): జిల్లాలో తీవ్ర తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం స్పందించింది. కలెక్టర్ పంపిన ఇండెంట్ మేరకు తుంగభద్ర జలాశయం నుంచి గురువారం దిగువ కాలువ (ఎల్‌ఎల్‌సీ)లోకి 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటిని పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, చెరువుల్లో నీటి కొరత నేపథ్యంలో తుంగభద్ర జలాశయం నుంచి 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రతిపాదనపై స్పందించిన ప్రభుత్వం తొలి విడతగా 900 క్యూసెక్కుల నీటిని ఎల్‌ఎల్‌సీ కాలువలోకి విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.

విడుదలైన నీరు దశలవారీగా కర్నూలు జిల్లాలోని చెరువులు, గ్రామీణ మంచినీటి పథకాలకు చేరేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నీటిని వ్యవసాయ అవసరాలకు మళ్లించకుండా పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగించేలా రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీసు శాఖలు సంయుక్తంగా పర్యవేక్షణ చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

జిల్లాలో నెలకొన్న తాగునీటి సంక్షోభాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యతో ప్రజలకు కొంత మేర ఉపశమనం లభించనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.