టార్గెట్ జెడ్పీ చైర్మన్… అందుకే ఊరు వాడ చర్చ
టార్గెట్ జెడ్పీ చైర్మన్… అందుకే ఊరు వాడ చర్చ
- కుంటాల జడ్పిటిసి రిజర్వేషన్ తేలకముందే నేతల ఢీ
- జిల్లా పరిషత్ పీఠంపై కన్నేసిన జీవి రమణారావు, నాలం శ్రీనివాస్
- తెర వెనుక అగ్ర నేతలు
కుంటాల, ఆంధ్రప్రభ:
ఆ ఇద్దరు నేతల లక్ష్యం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కావడంతో కుంటాల మండలంలో రాజకీయ వేడి పెరిగింది. జడ్పీటీసీ రిజర్వేషన్ ఇంకా ఖరారు కాకముందే మండలంలో చర్చలు జోరందుకున్నాయి.
నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్‌పై ఇంకా స్పష్టత రాకపోవడంతో పాటు కుంటాల జడ్పీటీసీ స్థానం ఎవరికి కేటాయిస్తారన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే కుంటాలకు చెందిన బీజేపీ నాయకుడు గుట్టుముక్కుల రమణారావు, పూల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నాళం శ్రీనివాస్ ముందుగానే ఎన్నికల క్షేత్రంలోకి దిగి, మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. సుమారు 20 వేల ఓటర్లున్న ఈ మండలంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
జడ్పీటీసీ కాదు.. అసలు లక్ష్యం జిల్లా పీఠమే
ఈ ఇద్దరు నేతలు కేవలం జడ్పీటీసీ గెలుపుతో సరిపెట్టకుండా, జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని లక్ష్యంగా పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. జీవీ రమణారావు ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాగా, నాళం శ్రీనివాస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.
తెర వెనుక అగ్ర నేతల అండదండలు
ఈ ఇద్దరు నేతలకు అగ్రనేతల మద్దతు ఉన్నట్లు సమాచారం. బీజేపీ తరఫున జీవీ రమణారావుకు స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ తరఫున నాళం శ్రీనివాస్‌కు మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి, బోస్లే నారాయణరావు పటేల్, మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పీఏగా నాళం శ్రీనివాస్ సుదీర్ఘకాలంగా పనిచేశారు. అల్లోల సూచనల మేరకే ఆయన వ్యూహాత్మకంగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ బలాబలాలతో పాటు ఆర్థికంగా కూడా ఇద్దరు నేతలు బలంగా ఉన్నారని స్థానికంగా చర్చ సాగుతోంది. అయితే వారి రాజకీయ భవిష్యత్తు జడ్పీటీసీ రిజర్వేషన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
