Krishna Water Dispute | కృష్ణా జలాలపై తెలంగాణ-ఏపీ మధ్య వాగ్వాదం

Krishna Water Dispute | కృష్ణా జలాలపై తెలంగాణ-ఏపీ మధ్య వాగ్వాదం

Krishna Water Dispute | పోతిరెడ్డిపాడుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం
ఆగస్టు 15 వరకే నీటి వినియోగానికి అనుమతి
ఈ నెల 14న మరోసారి కేఆర్ఎంబీ సమావేశం

Krishna Water Dispute | హైదరాబాద్, ఆంధ్రప్రభ: వేసవిలో తాగునీటి అవసరాల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నది యాజమాన్యం బోర్డు అంగీకరించింది. ఏపీ తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు, తెలంగాణ తాగునీటి అవసరాలకు 21 టీఎంసీల విడుదల చేయాలని నిర్ణయించింది. మంగళవారం జలసౌధలో కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలతో త్రిసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ బలమైన వాదనలు వినిపించింది. కృష్ణా నుంచి ఇప్పటికే వాటాకు మించి 200 టీఎంసీలు అదనంగా తరలించుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులను తెలంగాణ అడ్డుకుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లోని ప్రతి నీటి చుక్క తెలంగాణకే చెందుతుందని వాదన వినిపించింది.

ఏపీ జల చౌర్యాన్ని అడ్డుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ప్రధానంగా పోతిరెడ్డిపాడు Tournalism first!<br>నుంచి రోజుకు ఒక టీఎంసీ తరలిస్తూనే మళ్లీ తాగునీరు కావాలని ఏపీ కోరుతోందని అభ్యంతరం తెలిపింది. అయితే ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలకు నీటిపైనే చర్చించాలని, మిగతా అనేక అంశాలు ఈ నెల 14న జరగనున్న సమావేశంలో చర్చించాలని కేఆర్ఎంబీ కోరడంతో తాగునీటి అవసరాలపైనే సమావేశంలో వాగ్వాదం జరిగింది. వాదనల అనంతరం తెలంగాణ, ఏపీ తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

శ్రీశైలం, సాగర్ నుంచి నీటి విడుదలకు కేఆర్ఎంబీ అంగీకారం తెలిపింది. ఏపీకి సాగర్ నుంచి 10 టీఎంసీలు, తెలంగాణకు 16, శ్రీశైలం నుంచి తెలంగాణకు 6 టీఎంసీల వినియోగానికి కేఆర్ఎంబీ అనుమతిచ్చింది. ఈ అవకాశం ఆగస్టు 15 వరకు మాత్రమేనని స్పష్టం చేసింది. ఏపీ ఇప్పటికే ఎక్కువ నీరు వాడుకుందని సమావేశంలో తెలిపిన తెలంగాణ, సాగర్‌లో ఏపీకి 10 టీఎంసీలు పోగా మిగిలిన మొత్తం నీరు తమకే చెందుతుందని తెలిపింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 14న మరోసారి సమావేశం
త్రిసభ్య కమిటీ సమావేశం సాఫీగా సాగిందని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి తెలిపారు. ఆగస్టు 15 వరకు ఏపీ నీటి అవసరాల కోసం 10 టీఎంసీలు, తెలంగాణ శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 16 టీఎంసీలు వినియోగించుకోవచ్చని ఏపీ ఈఎన్సీ ప్రకటించింది. ఈ నెల 14న జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన అంశాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఏపీ కృష్ణా నుంచి అధిక మొత్తంలో నీటిని తోడుకుంటోందని తెలంగాణ ఈఎన్సీ రమేష్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఏపీకి కేటాయించిన 10 టీఎంసీలు మినహా మిగతా నీరంతా తెలంగాణకే చెందుతుందని చెప్పారు. ఈ నెల 14న జరిగే సమావేశంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి అక్రమంగా తరలిపోతున్న నీటిపై చర్చకు పట్టుబట్టనున్నట్లు చెప్పారు.

Leave a Reply