దర్శనం తర్వాతే ప్రసాదం..

దర్శనం తర్వాతే ప్రసాదం..

కనకదుర్గమ్మ భక్తులకు భారీ ఊరట!

ఇంద్రకీలాద్రి – ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులకు దేవస్థానం శుభవార్త అందించింది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రూ.500 ఆన్‌లైన్ దర్శనం టికెట్‌తో పాటు మహామణిద్వీపం ‘మనమిత్ర’ యాప్ ద్వారా టికెట్ పొందిన భక్తుల కోసం ప్రత్యేకంగా ఉచిత ప్రసాదం పంపిణీ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్‌ను దర్శనం పూర్తిచేసుకుని బయటకు వచ్చే మార్గంలో, నూతనంగా నిర్మించిన 7 అంతస్తుల రాజగోపురం సమీపంలో అందుబాటులో ఉంచారు.

ఇప్పటివరకు భక్తులకు దర్శనానికి వెళ్లే ముందే లడ్డూ ప్రసాదం అందజేయడం వల్ల రూ.500 దర్శనం క్యూ లైన్లలో చేతిలో ప్రసాదంతో ముందుకు సాగడం ఇబ్బందికరంగా మారిందని దేవస్థానం గుర్తించింది. భక్తుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా ఈ మార్పును అమలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నిర్ణయంతో ఇకపై భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకుని, తిరుగు ప్రయాణంలో ప్రసాదాన్ని సులభంగా స్వీకరించవచ్చు. భక్తుల సేవను మరింత మెరుగుపరచే దిశగా దేవస్థానం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయానికి భక్తుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.


Leave a Reply