AP | ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారుల వన్‌వే చర్యలు..

గోవుల బెడదకు చెక్‌…
రహదారులపై క్రమశిక్షణ
అధికారుల చొరవపై హర్షం వ్యక్తం చేస్తున్న మైలవరం ప్రజలు


AP | మైలవరం, ఆగస్టు11(ఆంధ్రప్రభ) : మైలవరం పట్టణంలో కొంతకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యకు అధికారులు ఎట్టకేలకు పరిష్కార చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు మంగళవారం నుంచి పట్టణంలో వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.

వన్‌వే ట్రాఫిక్‌కు అనుగుణంగా పోలీసులు అవసరమైన చర్యలు చేపట్టి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణికులకు కొంత ఊరట లభిస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు.

రోడ్లపై గోవుల సంచారానికి అడ్డుకట్ట…
మరోవైపు రహదారులపై సంచరిస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న గోవులను గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి తరలిస్తున్నారు.గోవుల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, రోడ్లపై పశువులను వదిలిపెట్టవద్దని అధికారులు సూచించారు.

సమన్వయంతో సమస్యకు పరిష్కారం…
పోలీసులు, ఆర్‌అండ్‌బీ, గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో చేపడుతున్న చర్యలపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ట్రాఫిక్ రద్దీ, రహదారులపై పశువుల సంచారం కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపడుతున్న అధికారుల పనితీరును మైలవరం ప్రజలు ప్రశంసిస్తున్నారు.