ప్రీమియం గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు
- ఎకరాకు రూ.90 వేల బీమా రక్షణ..
- రైతు వాటా కేవలం రూ.1,800 మాత్రమే
- నాట్లు వేసిన, వేయబోయే రైతులతో పాటు కౌలు రైతులకూ అవకాశం
- కరువు, తుఫానులు, అకాల వర్షాలతో దిగుబడి నష్టానికి పరిహారం
- రైతు సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
(విజయవాడ, ఆంధ్రప్రభ) : వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం తగ్గుదలతో మిరప సాగులో ఎదురయ్యే నష్టాల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అమలవుతున్న మిరప పంట బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఎన్టీఆర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి. బాలాజీ కుమార్ తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లో ప్రస్తుతం మిరప నారు షేడ్‌నెట్ నర్సరీల్లో పెరుగుతుండగా, ఇటీవల కురిసిన వర్షాలతో పలుచోట్ల నాట్లు ప్రారంభమయ్యాయి. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మున్ముందు మిరప పంటకు నష్టం, దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తుగా బీమా రక్షణ పొందాలని ఆయన సూచించారు.
మిరపకు మరో అవకాశం..

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మిరప పంటకు దిగుబడి ఆధారిత బీమా పథకం అమలులో ఉంది. తుఫానులు, కరువు, అకాల వర్షాలు తదితర ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడి తగ్గితే పంట కోత ప్రయోగాల ద్వారా వాస్తవ దిగుబడిని అంచనా వేసి బీమా పరిహారం చెల్లిస్తారు. ప్రస్తుత సీజన్‌లో మిరప నాట్లు వేసిన రైతులతో పాటు నాట్లు వేయబోయే రైతులు కూడా బీమాకు అర్హులు. కౌలు రైతులకు సైతం ఈ పథకంలో అవకాశం కల్పించారు. మిరప పంటకు ఎకరాకు రూ.90 వేల బీమా మొత్తం ఉండగా, రైతు చెల్లించాల్సిన ప్రీమియం రూ.1,800గా నిర్ణయించారు.
పంట రుణం తీసుకున్న రైతుల నుంచి సంబంధిత బ్యాంకులు ప్రీమియం వసూలు చేసి బీమా కంపెనీకి చెల్లిస్తాయి. రుణం తీసుకోని రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా కేంద్రం ద్వారా ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం లేదా కౌలు కార్డు, మిరప పంట సాగు చేసిన ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించి ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించవచ్చు. జాతీయ పంట బీమా పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. పంట కోత ప్రయోగాల ద్వారా ప్రస్తుత దిగుబడిని అంచనా వేసి, గత ఏడు సంవత్సరాల దిగుబడితో పోల్చిన అనంతరం వాస్తవ దిగుబడి తగ్గినట్లు నిర్ధారణ అయితే అర్హత మేరకు రైతులకు బీమా పరిహారం అందుతుంది.

కావున మిరప సాగు చేసిన, సాగు చేయబోయే రైతులు గడువు ముగిసేలోగా బీమా ప్రీమియం చెల్లించి పంటకు రక్షణ పొందాలని ఉద్యాన శాఖ సూచించింది. బీమాకు సంబంధించిన ఇతర వివరాల కోసం గ్రామంలోని రైతు సేవా కేంద్రాలు, మీ సేవా కేంద్రాలు లేదా ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని కోరింది. ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన టాటా ఏఐజీ బీమా కంపెనీ ప్రతినిధులు రమేష్ (నందిగామ–83090 99749), రాజీవ్ (తిరువూరు–8555058514)ను కూడా సంప్రదించవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి తెలిపారు.
