మత్తుకు వ్యతిరేకంగా గళమెత్తిన యువత

  • ’ డ్రగ్స్ వద్దు బ్రో.. నో డ్రగ్స్’ నినాదంతో భారీ అవగాహన ర్యాలీ
  • ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఈగల్ టీమ్, పోలీస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమం

గుడివాడ, ఆంధ్రప్రభ: మాదకద్రవ్యాల మహమ్మారిపై గుడివాడలో సమరశంఖం మోగింది. డ్రగ్స్ వద్దు బ్రో.. నో డ్రగ్స్ అంటూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నినదించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఈగల్ టీమ్, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ పురవీధుల్లో భారీ స్థాయిలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు.

ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ముందుగా నిర్వహించిన అవగాహన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. డ్రగ్స్ ఒక మహమ్మారి అని, వాటి బారిన పడితే కుటుంబాలు, యువత భవిష్యత్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని శత్రువులుగా చూడకుండా.. వారికి అవగాహన కల్పించి మంచి మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. స్నేహితులు, పరిచయస్తులు ఎవరైనా మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిసినా.. వారి జీవితాన్ని కాపాడేందుకు ఈగల్ టీమ్‌కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

గుడివాడలో డ్రగ్స్ రూపురేఖలు లేకుండా నిర్మూలించేందుకు చేస్తున్న పోరాటానికి విద్యార్థులు, యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. నో డ్రగ్స్ అనేది కేవలం నినాదం కాకుండా.. ప్రతి ఒక్కరి ప్రతిజ్ఞ కావాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.

ఎన్నికల ప్రచార సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ యువకుడు దేవుడు పిలుస్తున్నాడు అని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే రాము గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా యువతను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ సూచనలను వీడియో రూపంలో తెలియజేయాలని ఎమ్మెల్యే రాము కోరారు. గుడివాడ కోసం ఏం చేయాలనుకుంటున్నారో.. వీలైతే ‘ఐ లవ్ యూ గుడివాడ’ సెల్ఫీ పాయింట్ వద్ద వీడియో తీసి సోషల్ మీడియాలో #Anu Nenu #Gudivad హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఈగల్ హెల్ప్‌లైన్ 1972 నంబర్‌ను పలికించారు.

ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గుడివాడలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం మూడు విభాగాల్లో ముమ్మరంగా అమలు చేస్తోందని తెలిపారు.

మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని, అందులో భాగంగానే ఈగల్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశాలను కూడా అడ్డుకుంటున్నామని చెప్పారు.సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఐజీ పిలుపునిచ్చారు.

ఈగల్ ఎస్పీ జీ. స్వరూప రాణి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలను విక్రయించినా, రవాణా చేసినా కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద తీవ్రమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమైనవని, ప్రపంచవ్యాప్తంగా వాటి వినియోగాన్ని నిషేధించేందుకు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. చదువు, ఉద్యోగాల కోసం మెట్రో నగరాలకు వెళ్తున్న కొందరు యువత సింథటిక్ డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మాదకద్రవ్యాలపై జరిగిన అనేక దాడుల్లో విద్యార్థులు, ఉద్యోగులు కూడా పట్టుబడి జైలుకు వెళ్లిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. విద్య, ఉద్యోగాల కోసం ఎక్కడ ఉన్నా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు సూచించారు.డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని ఈగల్ ఎస్పీ కోరారు.

అనంతరం బ్రహ్మకుమారి సంస్థ సభ్యురాలు శైలజ ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు, ప్రముఖులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఎన్టీఆర్ స్టేడియం నుంచి డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ ప్రారంభమైంది. ముందుగా పోలీస్ బ్యాండ్, ఈగల్ టీమ్, పోలీస్ అధికారులు, సిబ్బంది ర్యాలీలో పాల్గొనగా.. వారి వెనుక హోమియోపతి కళాశాలతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు నో డ్రగ్స్.. సే నో టు డ్రగ్స్ అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకొని భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎజికే స్కూల్, ఏలూరు రోడ్డు, బొమ్మరిల్లు థియేటర్, నెహ్రూ చౌక్ సెంటర్, మార్కెట్ సెంటర్ మీదుగా సాగి తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకుంది.

భారీ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు చేపట్టారు. ర్యాలీ జరిగే మార్గాల్లో వాహనాల రాకపోకలను మళ్లించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.

కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు,ఆర్డిఓ బాలసుబ్రమణ్యం, గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాస్,ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, బిజెపి నాయకులు దావులూరి సురేంద్రబాబు,సీఐ లు శ్రీనివాస్, హనీష్, ఈగల్ సిఐ రవీంద్ర,స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగ ప్రసాద్, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, మజ్జాడ నాగరాజు, గోకవరపు సునీల్, నిమ్మగడ్డ సత్యసాయి, జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, హోమియో కళాశాల వైద్యులు, పట్టణంలోని వివిధ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.