స్వాతంత్ర్య వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు..

పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ


ఏలూరు, ఆగస్టు 14 (ఆంధ్రప్రభ ) : ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు పోలీసు కవాతు రిహార్సల్స్‌ను ఆయన తనిఖీ చేశారు.

ఈసందర్భంగా వేడుకల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రోటోకాల్‌కు అనుగుణంగా సీటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాలని సూచించారు. వేడుకల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వై.ప్రసాద్ రావు, చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏఆర్ ఆర్‌ఐ పవన్ కుమార్, సతీష్, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.